11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండుగొచ్చిందంటే దేశంలో ఏపీ వాళ్లు ఎక్కడ ఉన్నా.. సొంతూళ్లకు పయనం అవుతారు. రెండు మూడు నెలల ముందు నుంచే ఇందుకు సన్నద్ధం అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి కావడంతో ఇప్పటి నుంచే అక్కడికి తరలి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఆర్టీసీ కూడా ఇదే అదనుగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాలకు అనుగుణంగా లగ్జరీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందినవాళ్లు ఎక్కువగా సెటిల్ అయ్యి ఉండటంతో.. ఎక్కువగా జంట నగరాల నుంచి ఏపీకి పయనం అవుతుంటారు.
ఈ పండగ సీజన్ దగ్గర పడటంతో ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. ఈ సంక్రాంతి పండుగకు ఒక్క విశాఖ మీదుగా లక్షన్నర మంది ప్రయాణికులు.. తమ గ్రామాలకు వెళ్తారని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాళ్లు ఎక్కువగా హైదరాబాద్ లో సెటిల్ కావడంతో.. హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేశారు.
హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై నుంచి కూడా ప్రయాణికులు వస్తారని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్సులోని ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు.
అయితే సరైన సమయంలో బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు ప్రయాణీకులు. సమయానికి ఆర్టీసీ బస్సులు రాక.. ప్రైవేట్ బస్సులు దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అదనపు బస్సులతో ఆదాయం కూడా పెరిగిందన్న భావనలో ఆర్టీసీ ఉంది.
పండగమీద మమకారంతో పలువురు ఉద్యోగులు ఆంధ్రాప్రాంతానికి చేరుకుంటున్నారు. సొంత వాహనాలున్న వారితో దిగుతున్న వారితో ఆంధ్రా జిల్లాల్లో సందడి కనిపిస్తోంది. శని, ఆది వారాలు ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి మూడు రోజులు సొంతూరిలో గడపచ్చనుకున్న వారు చేరుకుంటున్నారు. పండుగ వేళల్లో జిల్లాలకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది.