11-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 11: ఎన్నికలకు మరెంతో కాలం లేకపోవడంతో ఎపిలో ఎలాగైనా పట్టు సాధించాలన్న యోచనలో బిజెపి ఉంది. ఇటీవల బిజెపి తన ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు, ఎక్కువ సీట్లు సాధించడం లక్ష్యంగా రాజకీయ ఎత్తులు వేస్తోది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే బిజెపికి చెందిన నేతలే మెల్లగా జారుకుంటున్న తీరు పార్టీని కలవరానికి గురి చేస్తోంది. పార్టీని నమ్ముకున్నా పెద్దగా లాభపడ్డదేమీ లేదన్న భావనలో పలువురు నేతలు ఉన్నారు.
ఇప్పటికే బీజేపీలో ముఖ్యమైన నాయకులు కమలం పార్టీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఐదేళ్లు పార్టీలో ఉన్నా పెద్దగా లాభం లేదన్న భావనలో ఉన్నారు. దీంతో ఎపిలో ఎన్నికల్లో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి కష్టాలు ఎదురవుతున్నాయి. క్రమశిక్షణగల పార్టీగా పేరున్నప్పటికీ... ఏపీలో మాత్రం బీజేపీ ఎదగడం లేదు.
ఢిల్లీలో ఏపీకి పెద్దదిక్కులాంటి వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవినుంచి దిగిపోవడంతో పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుండటం పార్టీ శ్రేణులనూ కలవర పెడుతోంది.