11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసినా సాదాసీదాగా ఉండడం మాజీమంత్రి అశోక గజపతిరాజుకు అలవాటు. ఆయన ఏనాడూ తాను రాజకుటుంబానికి చెందిన వ్యక్తిననే అహంభావానికి పోలేదు. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి, అయినా.. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. కానీ ప్రస్తుతం మాత్రం అతను చాలా సాధారణంగా ప్రజలతో కలిసి జీవిస్తున్నారు. అతను గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం.
విజయనగరం రాజ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతి రాజు సాధారణ వ్యక్తిగా జీవించడానికే ఇష్టపడతారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో అతనికి సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు నిరాడంబర జీవితం గడపడం పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
రాజు సింప్లిసిటీకి ఇది నిదర్శమని ఓ వ్యక్తి ప్రశంసించారు. అతను ఎటువంటి భద్రత లేకుండా విజయనగరం వీధుల్లో తిరగడం నేను చుశానని మరోక వ్యక్తి కామెంట్ చేశారు. రాజ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అతను ప్రజా జీవితంలో నిజాయితీగా ఉంటారని ఇంకొక వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని టీడీపీ తన సోషల్ మీడియా విభాగమైన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ఈ పోస్టు షేర్ చేసినప్పటి నుంచి లక్షా 35 వేల మందికి పైగా ప్రజలు దీన్ని వీక్షించారు.
అంతేకాదు 4727 మందికి పైగా లైక్ చేసి అనేక మంది రీట్వీట్లు కూడా చేస్తున్నారు. అయితే గజపతి రాజు గతంలో 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాజు 1983లో తొలిసారిగా కేబినెట్ మంత్రి అయ్యారు. దీని తర్వాత 2004 ఆంధప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పోర్ట్ ఫోలియోను ఆయన నిర్వహించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 2018 మార్చిలో రాజీనామా చేశారు. ప్రస్తుతం గజపతిరాజు విజయనగరంలోని గజపతుల బంగ్లాలో నివసిస్తున్నారు.
ఆయన మంత్రిగా ఉన్న సమయంలో తన నియోజవకర్గానికి చెందిన వారిని ఎవరినీ హైదరాబాద్ కు రానిచ్చేవారు కాదు. సమస్యలను నేరుగా తాసిల్దార్, కలెక్టర్లకు అర్జీలు సమర్పించేలా చేసేవారు. సమస్యలను వారికి చెప్పినా పట్టించుకోకపోతేనే ఆయన రంగంలోకి దిగేవారు. తనవద్దకు రావడం వల్ల అనవసరంగా ప్రయాణ, లాడ్జీ ఖర్చులు అవుతాయని వాదించేవారు. అందుకే ఆయన పేషీలో ఎప్పుడూ పైరవీకారులు కూడా ఉండేవారు కాదు.