11-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 11: అయోధ్య రామయ్య అందరికీ దేవుడని.. రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇది కోట్లాది భారీతీయులకు సంబంధించిన కార్యక్రమమని అన్నారు. ఇదేదో రాజకీయ కార్యక్రమంగా కొందరు వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాముడి చెంతకు రావడానికి అందరూ అర్హులేనని అన్నారు. రాజకీయంగా ముడపెట్టి కాంగ్రెస్ తన సంకుచిత ధోరణిని చాటుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. కేవలం
మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.