11-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 11: టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తనకు సీటు ఇస్తే విజయవాడ ఎంపీగా గెలచితీరుతానని అంటున్నారని, అలాగే టీడీపీ తరఫున కేశినేని చిన్నికి సీటు వస్తే అన్నాదమ్ములు ఇద్దరూ పోటీ పడతారా అన్న ప్రశ్నకు సమాధానంగా చిన్ని మాట్లాడుతూ..
తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్తను నిలబెట్టినా లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని నాని, జగన్.. ఎవరన్నా కానీ.. ఇక్కడ ఏడు నియోజకవర్గాలను టీడీపీ కైవశం చేసుకుంటుందన్నారు.
కేశినేని నాని అహంకారంతో గొడవపడి అందరినీ దూరం చేసుకున్నారని చిన్ని అన్నారు. తాను మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. తన సోదరుడు చాలాసార్లు విమర్శలు చేశారని, అయినా తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు.
తన భార్యపై ఒక స్టిక్కర్ చేసి పెట్టారని, ఒక ఎంపీగా ఆయన చేయవచ్చా? అని ప్రశ్నించారు. చాలా సార్లు మీడియాతో రకరకాలుగా తనపై, తన కుటుంబంపై అవమానం చేస్తూ మాట్లాడారని.. అయినా తాను ఏ రోజూ మాట్లాడలేదని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
ఎంపీ కేశినేని నాని ఎన్ని అంటున్నా 1999 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని ఆయన సోదరుడు కేశినేని శివనాధ్ (చిన్ని) తెలిపారు. తమ కుటుంబంలో అప్పటి నుంచి కలహాలు ఉన్నాయని.. వాటితో తెదేపాకు, అధినేత చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు.
బుధవారం సీఎం జగన్ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. మా కుటుంబంలో దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయి. ఎంపీ టికెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు.
అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు ఆయన చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదు. స్టిక్కర్ గురించి నా భార్యపై మీరు దొంగ కేసు పెట్టారు. కుటుంబం, పార్టీ విషయాలు కలపకూడదని ఏరోజూ నేను మాట్లాడలేదు.
'యువగళం' పాదయాత్రలో నారా లోకేశ్ వెంట లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు నడిచారు. విజయవాడకు హెచ్సీఎల్ సహా ఎన్నో సంస్థలు వచ్చాయంటే దానికి ఆయనే కారణం. ఎంతోమంది మహామహులు వీడినా తెదేపాకు ఏమి కాలేదు. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు