11-01-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జనవరి 11: సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సత్తుపల్లి మండలం యతాలకుంట వద్ద టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని, సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైందని యతాలకుంట టన్నెల్ అని తుమ్మల ప్రశంసించారు.
టన్నెల్ పనులు రెండు వైపులు నుంచి చేసుకుంటూ రావాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటమే తన రాజకీయ లక్ష్యమన్నారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామల మవుతుందన్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనదని, పనులు రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఈ నెల 8న హైదరాబాద్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా రిజర్వాయర్, లంకాసాగర్ చెరువు, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు.
ఏనూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్ లు పూర్తి చేసి, పనులు మొదలు పెట్టాలన్నారు. యాతాలకుంటలో భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాలు ఈ సీజన్లో సాగునీరు ఇవ్వొచ్చన్నారు. సత్తుపల్లి కెనాల్ కు సంబంధించి భూసేకరణకు రూ.12 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలేరు టన్నెల్ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్‌కూ జలాలు తీసుకురావొచ్చన్నారు.