11-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 11: అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ తన హిందూ వ్యతిరేకతను మరోమారు చాటుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. అయోధ్యతో రాజకీయాలకు సంబంధం ఏముందన్నారు. ఇది దేశా ఔన్నత్యానికి, గౌరవానికి ప్రతీక అన్నారు.
రామమందిరం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ బహిష్కరించడంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బహిష్కరించటం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. హిందువులను అవమానించటమే అని అన్నారు.
హిందువుల జీవన విధానమంటే కాంగ్రెస్ కు చులకన అని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల కమిషనన్ను కాంగ్రెస్ బహిష్కరిస్తోందన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకత్వం కాంగ్రెస్ ది అని విమర్శించారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలంటే కాంగ్రెసు గౌరవం లేదన్నారు. హిందుత్వ వ్యతిరేక ధోరణిని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుందన్నారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించటం దుర్మార్గమని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రణమ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అన్నారు. హిందువులకు సంబంధించిన ప్రతీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. అయోధ్య కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ వితండవాదం చేసిందన్నారు. సనాతన ధర్మాన్ని క్యాన్సర్తో పోల్చి.. కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందన్నారు.
1947లో సోమనాథ్ దేవాలయానికి వెళ్ళొద్దని .. అప్పటి రాష్ట్రపతి రాజేందప్రసాద్కు నెహ్రూ లేఖ రాశారని గుర్తుచేశారు. అయోధ్య రామమందిరం జాతికి సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. రామాలయం ప్రారంభోత్సవానికి ఫాస్టర్లు, ముస్లిం మత పెద్దలు హాజరవుతున్నారని కిషన్రెడ్డి వెల్లడించారు.