11-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 11: ఎలాంటి ఆధారాల్లేకుండానే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఏ ఒక్కదాంట్లోనూ ఆధారాల్లేవని కోర్టులే స్పష్టం చేశాయన్నారు. వనరులెక్కడ ఉంటే అక్కడ వైసీపీ నేతలున్నారన్నారు.
గాంధారి పుత్రుల్లాగా వైసీపీలో 150 మంది ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. న్యాయ శాస్త్రంలోని లోసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టారన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో అవినీతి జరిగిందని వేసిన కేసు చూసి న్యాయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.
మద్యం అమ్మకాల్లో కిక్ బ్యాగ్స్ తీసుకుంటున్న చరిత్ర జగన్ది కాదా..? అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల విూద ఆరోపణలు గుప్పించింది సీఎం జగన్ కాదా అని నిలదీశారు. సీఎం జగన్ దోచుకుంటూ.. దాచుకుంటున్నారన్నారు. ఓ పక్క దోపిడీ చేస్తూ చంద్రబాబుపై కేసులు వేస్తున్నారన్నారు.
బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకోలేదా అని అడిగారు. చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించడం సీఎం జగన్ నాయన వల్లే కాలేదని.. 16 నెలలు జైల్లో ఉన్న సీఎం జగన్ వల్ల ఏమవుతుందని విమర్శించారు.
జగన్ మనిషి పుట్టుక పుడితే తనపై ఉన్న కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. పెద్ద ఎత్తున కేసులున్నా.. కోర్టులకు వెళ్లకుండా జగన్ కాలయాపన చేస్తున్నారని అన్నారు. కోర్టుకెళ్లేందుకు సీఎం జగన్ కు సమయమే లేదంట అంటూ మండిపడ్డారు.
16 నెలలు జైల్లో ఉన్న దొంగ జగన్ అని.. అక్రమ కేసులు వేస్తే దొర దొంగవడు.. దొంగ దొరవడని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలపై పెట్టిన కేసుల్లో ఒక్క చోటైనా నిరూపించగలిగారా అని ఆలపాటి రాజా ప్రశ్నల వర్షం కురిపించారు.