12-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరువూరు, జనవరి 12: మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరగా, ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న తిరువూరు నుంచి మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామిదాస్ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. గురువారం సాయంత్రం స్వామిదాస్ ఆయన సతీమణి సుధారాణి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. సీఎం జగన్ దంపతులకు కండువ కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గత మూడు దశాబ్దాలుగా నల్లగట్ల స్వామిదాస్ టీడీపీలో కొనసాగారు. 1994, 1999 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. నేను టీడీపీలో 30 ఏళ్ల వరకు పనిచేశాను, చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటారు. అవసరం లేకపోతే ఎవరినీ దగ్గరికి కూడా రానివ్వరు. ఇన్నేళ్ళు టీడీపీకి ఎంతో నమ్మకంగా పనిచేశాను.. కనీసం ఒక్కసారి కూడా ఇంట్లోకి నన్ను రానివ్వలేదు. ఆయన ఎవరితోనూ మానవత్వంతో వ్యవహరించారు.
నేనూ.. నా భార్య ఒక సందర్భంలో పది రోజులు ఆయన ఇంటి ముందు ఎదురు చూసినా మమ్ముల్ని పట్టించుకోలేదు. అంతేందుకు టీడీపీ నేతలు కొంతమంది నన్ను వెన్నుపోటు పొడిచారు. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు ఇస్తున్న ప్రాధాన్యత, సంక్షేమ పథకాలు అందించడంలో చూపుతున్న శ్రద్ద నన్ను బాగా ఆకర్షించాయి.. అందుకే వైసీపీలో చేరాను. రాష్ట్రాభివృద్ది కోసం సీఎం జగన్ ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నా’ అని అన్నారు.