12-01-2024 RJ
తెలంగాణ
మెదక్, జనవరి 12: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందని, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కెసీఆర్ లేకుండా తెలంగాణ లేదని.. కేసీఆర్ ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చాయని, మన గ్రామలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలం, జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తున్నట్లు తెలిసిందని, కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటోందని, కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్‌పై అబద్దాలు చెబుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేశారని విమర్శించారు.
మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని, నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని అన్నారు. కాంగ్రెస్ కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్కు ప్రజలంటే బాధ్యత అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయమని.. వారి పక్షాన పోరాడతామని, బీఆర్ఎస్కు ప్రజలే దేవుళ్లని అన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది.
కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.