12-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో ఆంక్షలు బద్దలయ్యాయని.. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోందని నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా బతికే రోజులు వచ్చాయని అన్నారు. గత పదేళ్ల పాలన అంతా నిరంకుశంగా, నిర్బంధాలతో సాగిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరకుశం రాజ్యామేలిందన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి, పాలనీతీరు బాగుందని..
జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, అన్ని అంశాలపై సమీక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ప్రభుత్వం ఎత్తేస్తుందని, ఉద్యమ కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న తపతనో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, పాపప్రక్షాళనకు కూడా పూనుకోవడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. పదవులు బాధ్యత తప్ప తమకు అవేమి అధికారాన్ని అనుభవించే అవకాశం కాదని చెప్పారు. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని ఆనాడే చెప్పామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి పోటీ చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.
ఈ క్రమంలో ఆయన ఆలోచనల్ని.. సేవల్ని తెలంగాణ అభ్యున్నతి కోసం వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ముందు నుంచీ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంమలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ రెండు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ రెండింటిలో ఒకటి కోదండరాంకు ఇచ్చేలా హైకమాండ్ కు రేవంత్ సిఫారసు చేశారని చెబుతున్నారు. వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు. రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయనను మంత్రిని చేయాలని కోదండరాం అనుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర కీలకం. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది.
తర్వాత కోదండారంను మొత్తంగానే దూరం పెట్టింది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. పదవుల కోసం అయితే కేసీఆర్ వెంటే ఉండేవారని.. ఆయన తెలంగాణ బాగు కోసమే పని చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.
కోదండరాంను మంత్రిని చేస్తే.. బీఆర్ఎస్ పై నైతికంగా పైచేయి సాధించినట్లవుతుంది. కోదండరాం కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.