12-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 12: దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆహారధాన్యాల కొరత నివారణకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని అన్నారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటి సద్వినియోగానికి.. గోదావరికి అడ్డంగా ప్రాజెక్టులు కట్టామని గుర్తు చేశారు. దీంతో 30 లక్షల టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం పోచారం మాట్లాడుతూ.. అన్ని వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచామని అన్నారు. అనేక ప్రాజెక్టుల కింద రెండో పంట పండుతుందంటే అది కేసీఆర్ దూరదృష్టి ఫలితమే అని పోచారం స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. వరి దిగుబడి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీళ్లు ఉంచుకుని కూడా ఇవ్వకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజి దాకా నీటిని వాడుకోవచ్చని సలహాఇచ్చారు. మహారాష్ట్ర కోయినా ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల నీరు తీసుకురావాలని.. ప్రభుత్వం ప్రతిపాదించడం అనాలోచిత చర్య అని పోచారం అభిప్రాయపడ్డారు. కోయినా డ్యామ్ మనకు 1300 కిలోమీటర్ల దూరంలో ఉందని..
ఆ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవడమంటే కాలంతో పాటు నీరు వృథా అవుతుందని తెలిపారు. 30 టీఎంసీల నీళ్లు అక్కడ్నుంచి వదిలితే.. ఇక్కడికి వచ్చేసరికి 15 టీఎంసీలు కూడా రావని చెప్పారు. వరి దిగుబడి తగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్య వహించాలని డిమాండ్ చేశారు.