12-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 12: కాంగ్రెస్ పార్టీపై హిందుత్వ వ్యతిరేక ముద్రవేయాలని చూస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. అయోధ్య విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే హిందుత్వం ఉందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలో రామాలయానికి ఫౌండేషన్ వేశారని తెలిపారు. కొందరు కోర్టులో కేసు వేయడంతో నిర్మాణం ఆగిందన్నారు. దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆనాడు హిందువుల కోసమే కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర పోరాటం చేశారని ఆయన చెప్పారు.
మతం పేరుతో కిషన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను ప్రేమించాలని, ఒకే మతాన్ని కాదని ఆయన హితవు పలికారు. బీజేపీ వాళ్లే రామలయాన్ని రాసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తలంబ్రాల పంపిణీ పేరుతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ యాత్రపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాటలను ఆయన ఖండించారు. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రపై కామెంట్స్ సహించబోమన్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం రాహుల్ యాత్ర చేస్తున్నారని తెలిపారు. చేసిన అభివృద్ధిపై ప్రచారం చేసుకోక పోవడంతోనే ఓడిపోయామని కేటీఆర్అనడం సిగ్గుచేటన్నారు.
అసలు ప్రజలను పట్టించుకోకుండా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన మండిపడ్డారు. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. చేసిన అవినీతిని ఒప్పుకోకుండా ఎదరుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ తప్పుల నుంచి తప్పించుకోలేదని అన్నారు.