12-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 12: రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి... గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
మెజార్టీ పనులు పూర్తయిన ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని మండిపడ్డారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించ లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఉదయ సముద్రం బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనార్స్ తో పెండింగ్ లో ఉన్న టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాలువలను పూర్తిచేసినప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని మండిపడ్డారు. కాలువలకు మరియు వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగిందని చెప్పారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు, పనులకు గానూ మరో 100 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.