13-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 13: ఆదిలాబాద్ రీజియన్లో సంక్రాంతి పండగ వారం రోజుల్లో భారీగా ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఈ సారి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 13,14,15 తేదీల్లో అదనపు సర్వీసులు నడుపుతుండగా..
తిరుగు ప్రయాణంలో ఈనెల 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు మరిన్ని బస్సులను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఉన్న డిపోల నుంచి రాష్ట్ర రాజధాని మరిన్ని 55 సర్వీసులను నడుపుతున్నారు.
నిర్మల్, మంచిర్యాల, కాగజ్ నగర్, సిర్పూర్(టి), బెల్లంపల్లి, మందమర్రి, బాసర ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది. రైళ్లలోనూ తమ స్వస్థలాలకు చేరేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున వరుస కడుతున్నారు. దీంతో ఆయా రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో వాహనాల రద్దీ ఉంటుందని..
నేరడిగొండ, కడ్తాల్ టోల్ ప్లాజాల వద్ద అన్ని ద్వారాలు తెరిచేశారు. చాలామంది బస్సు ప్రయాణాన్ని ఎంచుకోవడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 500-600 వరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి.
అదే సంక్రాంతికి ముందు మూడురోజులు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు వేసినా సరిపోని పరిస్థితి. దీంతో పలు ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా ధరలు పెంచడం సామాన్య ప్రయాణికులకు పెనుభారంగా మారింది. చాలామంది ట్రావెల్స్ నిర్వాహకులు సీట్లను బ్లాక్ చేసి మూడింతలు, నాలుగింతల ధరలకు విక్రయిస్తున్నారు.
రవాణాశాఖకు ఛార్జీలు ఎగవేసేందుకు తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న నిర్వాహకులు ప్రతి స్టేజీలో ఆపుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ఉన్నతాధికారులు ప్రమాదాలు జరిగిన సమయాల్లో హడావుడి చేయడం, తర్వాత చేతులు దులిపేసు కోవడం సర్వసాధారణమైందనే విమర్శలున్నాయి. పలు ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి.