13-01-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జనవరి 13: తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, కాళేశ్వరం అందులో భాగమని మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. కాళేశ్వరం ఏదో అవినీతి జరిగిందన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు. విచారణలో అన్నీ తేలుతాయని అన్నారు. కోటి ఎకరాల మాగాణి తెలంగాణ లక్ష్యంగా సిఎం కెసిఆర్ ప్రాజెక్టుల కోసం కృషి చేసారని అన్నారు.
రైతులకు 24 గంటల విద్యుత్తు అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకున్నామని అన్నారు. కాళేశ్వర్ నీటిని తెచ్చామన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మీదుగా మిడ్ మానేరుకు నీరు వస్తుందని, అక్కడి నుంచి మల్లన్నసాగర్ వరకు నీరు వచ్చేలా పనులు జరిగాయన్నారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ 42 కి.మీ.ల దూరం ఉండగా అందులో 33 కి.మీ.ల దూరాన్ని రూ.10 వేల కోట్లు వెచ్చింది సొరంగం తవ్వకం చేపట్టామన్నారు. మల్లన్నసాగర్ నుంచి నల్గొండ, నిజాంసాగర్, కామారెడ్డి ప్రాంతాలకు సాగునీటిని అందించాన్నారు.
రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు సరఫరా చేసామన్నారు. విద్యుత్ ఉత్పాదనరంగంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేసామని అన్నారు. కేసీఆర్ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో కృషిచేసామన్నారు. ఇవన్నీ ఆస్తులు సృష్టించినట్లే కదా అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన వేగంగా జరిగిందన్నారు.
గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు కరెంటు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ విద్యుత్ను కొనుగోలు చేసి సరఫరా చేశామన్నారు. కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ వల్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లు త్వరితగతిన పూర్తి చేసుకొని ఉత్పత్తి చేసుకోగలి గామని అన్నారు. రైతులకు కూడా 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న కేసీఆర్ ఏకైక లక్ష్యం నేరవేరిందన్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వాస్తవ అభివృద్ధిని చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారని, దీని వల్ల రైతులు, అన్ని వర్గాల వినియోగదారులు సంతోషంగా ఉన్నారన్నారు.