13-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 13: అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏప్రిల్, మేలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. అయితే అదే విషయాన్ని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు పట్టుబట్టారు. అలా చేస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. కానీ అందుకు ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగనుంది. ఈ విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని సజ్జల అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయని అన్నారు. అంగన్ వాడీల డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని.. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని అన్నారు.
వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పామని అన్నారు. అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నామని.. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించామని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సజ్జల అన్నారు. ఈ సమ్మె వెనుక పక్కా రాజకీయ ఎజెండా ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎజెండా వల్ల అంగన్వాడీలు నష్టపోతారని అన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని..
గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి వారి సేవలను తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని అన్నారు. అంగన్వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారు. ఇక వారు విధుల్లో చేరకపోతే ప్రభుత్వ అవసరాల కోసం కొత్తవారిని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందని సజ్జల అన్నారు. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తప్పకపోవచ్చని సజ్జల చెప్పారు.