14-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు.
ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుడి కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు.
తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్నీ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... పతంగుల పండగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. పతంగులకి దారం ఆధారం అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని చెప్పారు. సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా పతంగుల పండగ జరుగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.