14-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 14: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడి పందాలే పండగగా భావిస్తున్నారు. పందెంరాయుళ్లు ఇప్పటికే వందల సంఖ్యలో మేలు జాతి కోడి పుంజులు, రూ.లక్షల నగదు సిద్ధం చేసుకుని బరిలోకి దిగటానికి ఉవ్విళ్లూరుతున్నారు. పందేల కోసం వస్తున్న వారికి సకల సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి వస్తుందంటే పందెంరాయుళ్ల సందడి అంతా, ఇంతా కాదు. నాలుగైదు రోజులపాటు వీరంతా పూర్తిగా పందేల్లో మునిగి తేలుతుంటారు.
ఇప్పటికే కోడి పుంజలను తీసుకుని ఖరీదైన కార్లలో ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళ్లారు. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు పందేల లెక్కన ఆయా మూడ్రోజుల్లో రూ.5 కోట్ల మేర చేతులు మారనున్నట్లు అంచనా.
రాత్రిళ్లూ వీటి నిర్వహణకు ప్లడ్లైట్లను అమర్చుతున్నారు. పందేలను తిలకించటానికి బాపట్ల, రేపల్లె, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు నియోజకవర్గాలతోపాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా చీరాల నియోజక వర్గాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు.
బాపట్ల పట్టణంతోపాటు, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవారిపాలెం మండల గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో పందెంరాయుళ్లు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, భీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వెళ్లారు. వీరి కోసం ఆ ప్రాంతంలో ప్రత్యేక బస, భోజన ఏర్పాట్లు చేశారు. వాటిలో రూ. లక్షలు పోగొట్టుకుంటున్నా ఆడటం మాత్రం ఆగటం లేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా స్థానికంగా రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు చిన్న, చిన్న వాటిని మాత్రమే అడ్డుకోగలుగు తున్నారన్న విమర్శలున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిబంధనలకు విరుద్ధంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పందేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కోడి పందేలపై మళ్లీ అదే సస్పెన్స్. జరుగుతాయా..! లేదా? అని. కోర్టుల ఆదేశాలు.. పోలీసులు హడావుడి... మైకుల్లో ప్రచారాలు, కత్తులు, పుంజుల స్వాధీనం, బరుల ధ్వంసం, నిర్వాహకుల అరెస్టులు అన్నీ సాగిపోతున్నాయి. పండగ మూడు రోజులూ పందేలు జరుగుతాయి. మీరొచ్చేయండి.. అంటూ సందేశాలు. ఇందుకు తగినట్టుగా పందేల బరులూ సిద్ధమైపోతున్నాయి.
నిర్వాహకులు కోళ్లు, కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. ఓచోట పోలీసులు బరిని ధ్వంసం చేస్తే.. మరోచోట బరులు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ గేలరీలు, పేకాటకు ప్లడ్లైట్లు, భారీగా మద్యం దుకాణాలు అన్ని ఏర్పాట్లూ చకచకా సాగిపోతున్నాయి. వారం రోజులుగా అనేక ప్రాంతాల్లోని పందెం బరులను పోలీసులు తొలగించారు. పోలీసులు ఓవైపు తొలగిస్తూ ఉంటే..
నిర్వాహకులు మరో ప్రాంతంలో బరులను ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా పందేలు నిర్వహించారు. ఈసారి కొంత సస్పెన్స్ కొనసాగుతున్నా.. చివరికి అంతా సజావుగా సాగుతుందని అంటున్నారు.
కాగా, భీమవరంలో కోడి పందేలు చూసేందుకు ఏటా స్నేహితులు, బంధువుల కుటుంబ సభ్యులతోపాటు సుమారు రెండు లక్షల మంది టూరిస్టులు వచ్చేవారు. ఈసారి ఆస్థాయిలో వచ్చే అవకాశం లేదని భీమవరం ప్రాంత హోటల్ యజమానులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 20కిపైగా పెద్ద బరులు, వందకుపైగా చిన్న బరులు సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున జరిగే పందేలను తిలకించేందుకు పందెపురాయుళ్లు కోనసీమకు క్యూ కడుతున్నారు.
కృష్ణా జిల్లాలో కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ భారీస్థాయిలో బరులు సిద్ధమయ్యాయి. విజయవాడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతోపాటు గుడివాడ, గన్నవరం, పెనమలూరు, బంటుమిల్లి, కైకలూరు, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేశారు.
పందెం రాయుళ్లకు ఫోన్లు చేసి పిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తోటల్లో నిర్వాహకులు రహస్యంగా బరులు తయారు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల కోడిపుంజులకు కట్టే కత్తులను భారీగా తయారు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటికే బెట్టింగ్ బాబులు విజయవాడ చేరుకుని హోటళ్లలో మకాం వేశారు.