14-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 14: సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలోని వలసజీవుల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో రెండురోజులుగా నగరం బోసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ తగ్గింది. అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది.
పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం ఔటర్ రింగ్ రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్ఆర్ పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పదిలక్షల వాహనాలు ఔటర్పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. ఇకపోతే నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు కానరావడం లేదు. వాహనాల రొద బాగా తగ్గింది.
ట్రాఫిక్ తగ్గిపోవడంతో వాహనదారులు వేగంగా గమ్య స్థానాలకు చేరుకోగలు గుతున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో దద్దరిల్లే రహదారులు బోసిబోయి కనిపిస్తున్నాయి. లాక్డౌన్ పెట్టినట్టుగా.. పలు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్ల వెంట తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు గిరాకీ కోసం పడిగాపులు కాసారు.
ఐటీ కారిడార్లోని రోడ్లపై నిమిషానికి వేలాది వాహనాలు రాకపోకలు సాగించిన పరిస్థితి ఉండగా.. పదుల సంఖ్యలోనే కనిపించాయి. నగరంలోని రహదారులపై రద్దీ తగ్గినా.. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 3.30 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి.
అటు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైనా రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోలెగేటు వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పండక్కి సొంతూరికి వెళ్లాలన్న నగరవాసుల కోరికను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
ప్రైవేటు బస్సుల్లో చార్జీలను సాధారణ రోజుల్లో కంటే 40 నుంచి 50 శాతం మేర పెంచేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికుల జేబులు గుల్ల అయ్యాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఇప్పటికే నిండిపోవడంతో వేరేమార్గం లేక వాటిలో ప్రయాణిస్తున్నారు.