14-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణమనే తేడాలేకుండా వేకువజామున లేచి భోగి మంటలు వేసి.. వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. హైదరాబాద్ లోని పలు కాలనీల్లో సంక్రాంతి సందడి నెలకొన్నది. ఆడపడుచులు రంగురంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి వాటిని గొబ్బెమ్మలు, భోగి పండ్లతో అలంకరిస్తున్నారు.
ఇక ఎన్నికల ముంగిట పండుగ రావడంతో ఆంధప్రదేశ్లో జోరు పీక్లో ఉన్నది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆయన.. తనదైన స్టెప్పులతో ప్రజలను అలరించారు. అనంతరం మాట్లాడుతూ తాను సంక్రాంతి సంబరాల రాంబాబునేని అన్నారు. గత నాలుగేండ్లుగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని వెల్లడించారు.
రామంచంద్రాపురం నియోజకర్గంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. పండుగలు తెలుగు వారి సంప్రదాయాల సంరక్షిస్తున్నాయని చెప్పారు. సంక్రాంతి, భోగి అంటే మనసులో ఉన్న మలినాలను కడిగేలాంటిదని తెలిపారు. మంత్రి రోజా.. నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భర్త సెల్వమణితో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్ లోకల్ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇక్కడకు వచ్చి ఏదో చెబితే ప్రజలు నమ్మరని అన్నారు.
భోగి, ఎన్నికలు ముగియగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లారని విమర్శించారు. తమ పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు అంటున్నారు. 2019లోనే ప్రజలు ఆ పార్టీ తగలపెట్టారని, వచ్చే ఎన్నికల్లోనూ అదే చేస్తారన్నారు. గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సంక్రాంతి సందడి కనిపించింది. భోగి మంటలకు పిడకలు, గొబ్బెమ్మలకు కూడా అంతారెడీమేడ్ వ్యవహారాలే నడిచాయి.
హరిదాసుల పాటలు. గంగిరెద్దుల ఆటలు.. సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతున్న చిన్నారులతో సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుంది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఒక్కచోటకు చేరి రంగవల్లికలు తీర్చిదిద్దుతున్నారు. ఉదయమే పలుకాలనీల్లో భోగిపమంటలు వేశారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా దర్శనమిచ్చాయి. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు పలుకరించాయి. ఇప్పటికే చాలామంది నగరవాసులు సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు.
ఇక్కడే ఉన్నవారు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతి ముంగిటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముంగిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు.. ముచ్చటగా కనిపించే గొబ్బెమ్మలతో చాలా ముందుగానే సంక్రాంతి వచ్చిందా అనిపించింది. సంక్రాంతి... పది రోజులు ముందుగానే.. పల్లెల్లో పండుగ మొదలవుతుంది. ఉదయం, సాయంత్రం.. ఇంటిముందు కళ్లాపి చల్లి... అందమైన ముగ్గులు వేస్తారు. అవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంక రిస్తారు.
గ్రామాల్లో అవులు, గేదెలు ఉంటాయి కాబట్టి పేడకు కొదవ ఉండదు. సిటీలో పేడరంగు లాంటి పౌడర్ కల్లాపి చల్లి రంగవల్లులు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షల అందులో మెరిశాయి. పిల్లలకు భోగిపండ్లు పోస్తూ సంబరాలు చేసుకున్నారు. పలు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు వేడుకల ఏర్పాటు చేసారు. వేషధారణలు, ముత్యాల ముగ్గుల పోటీలు పెడుతున్నారు. సంప్రదాయ పిండివంటలను రుచి చూపుతున్నారు.
తెల్లవారుజామునే.. భోగిమంటలు వేసి.. కొత్త సరదాలను ఆస్వాదించారు. ఇక సంప్రదాయ పిండివంటలు చేసి అమ్మే షాపులు కిటకిటలాడాయి. చేతి వంటలను చెంతకు చేర్చే ఎన్నో షాపులు నగరవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. పండుగ సందర్భంగా నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వాహకులు సంక్రాంతి ప్రత్యేక ఆహారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పులిహోర, నాటుకోడికూర, పప్పుచారు, అరిసెలు, బందరు లడ్డు, బూందీ లడ్డు, పెరుగు అవడలను అందిస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించేందుకు రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. అరిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, జంతికలు, గవ్వలు, చెక్కలు, సున్నుండలు, పూతరేకులను ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు.