14-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 14: తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురాలను మొదలు పెట్టారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు.
గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు, వేదపండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు..
‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’. అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.