16-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా వెళ్లిపోయారు. ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు తెలిపారు.
ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన ఆర్టీసీ.. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సీజన్ లాభాలను తెచ్చిపెట్టింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ స్థిరపడిన పలువురు పండుగ సందర్భంగా తమ స్వస్థలాలకు తరలి రావడంతో ఆదాయం భారీగా సమకూరిందని సమాచారం.
విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కళాశాలల్లో చదువుకునే యువతీ యువకులు కూడా తమ సొంత గ్రామాలకు తరలిచ్చారు. ఉద్యోగాలు చేసే వారు కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకుని ఆర్టీసీలో ప్రయాణించారు. అయినా సీట్లు దక్కని చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించి రోజూ వారీ ఛార్జీల కంటే ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంతో వారికి కూడా బాగా కలసి వచ్చింది.
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి రెగ్యులర్ నడిపే బస్సులతో పాటు అదనపు సర్వీసులను నడిపారు. రెగ్యులర్ నడిచే బస్సులతో పాటు అదనంగా ఏర్పాటు చేసిన బస్సులతో సౌకర్యం కల్పించారు. దీంతో ఆర్టీసీకి సంక్రాంతి పండుగ రోజుల్లో భారీగా ఆదాయం సమకూరింది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల నుంచి హైదరాబాద్ నుంచి ప్రతి రోజూ నడిచే బస్సులతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం 16తేదీ మంగళవారం నుంచి 20తేదీ వరకు ప్రయాణికు లను హైదరాబాద్ చేరవేసేందుకు కూడా అదనపు సర్వీసులను నడుపుతున్నారు.
హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడు అదనపు బస్సులు నడిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేక బస్సులు వేశారు. ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారు. ఆర్టీసీ బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడు తుండడంతో సంక్రాంతి పండుగ రోజుల్లో అధికంగా ఆదాయం సమకూరిందని సమాచారం.
సంక్రాంతి పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీలను అమాంతం పెంచారు. ఆర్టీసీ సంస్థకు వస్తున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులకు ఛార్జీలు పెంచకుండా ఆదాయాన్ని రాబట్టుకున్నారు. ప్రైవేట్ సంస్థలకు భారీగా ఆదాయం సమకూర్చింది.