16-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, జనవరి 16: ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఎయిర్ పోర్ట్ నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వయంగా స్వామి వారికి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ.. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీరామ్ జైరామ్ అంటూ భజన పాటలు సైతం భక్తి భావంతో పాడారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధాని మోదీకి వివరించారు. ఆలయం ప్రాంగణంలో సీతారాముల విశేషాలను తెలిపేలా తోలుబొమ్మలాటల రూపంలో రామాయణంను ప్రదర్శించారు.
లేపాక్షి సందర్శన అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రం లో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.