16-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వరుసగా రెండు రోజుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర చంపేస్తామంటూ కాల్స్ వస్తున్నాయన్న రాజా సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బెదిరింపులకు తాను భయపడనన్న రాజాసింగ్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరమైన వెళ్తానని చెప్పారు.
తాను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి. కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు మరో వారం రోజుల్లో అయోధ్యలో శ్రీరామప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.