16-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 16: ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహా విష్కరణ చేయనున్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ వి. విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట పాల్గొన్న సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. రూ.400 కోట్లకు పైన నిధులతో చరిత్రలో నిలిచేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ నిర్మించారని తెలిపారు.
అన్ని వర్గాలతో పాటుగా ఎస్సీలు కూడా సమానంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయంటే ఆ ఘనత అంబేడ్కర్ కే దక్కుతుంది.
ఎస్సీల అభ్యున్నతి కోసం వైసీపీ సర్కారు నిరంతరం పని చేస్తుంది. నవరత్నాలు రూపొందించి సుపరిపాలన అందిస్తున్నారు. అంబేద్కర్ దార్శనికుడు, ధీశాలి. సమాజంలో ఉన్న వివక్షలు తొలగించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిది. అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ చేసిన కృషి అందరికీ స్పూర్తి దాయకం.
విజయవాడలో నిర్మించిన భారీ విగ్రహం సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. భావితరాలన్నీ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే లక్ష్యంతోనే విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పూర్తిగా నిలిచిపోతుంది.
బడుగు బలహీన వర్గాలు, అంబేద్కర్ ను అభిమానులు మొత్తం లక్ష 20 వేల మంది సమక్షంలో ఆవిష్కరిస్తాం. భవిష్యత్తులో ప్రాంగణం పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అనేది అప్రస్తుతం.
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఎవరినీ ప్రత్యేకించి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ పై అభిమానం ఉన్నవారంతా రావచ్చు. పార్టీలకు అతీతంగా కార్యక్రమాన్ని సీఎం నిర్వహిస్తున్నారు' అని విజయసాయి రెడ్డి తెలిపారు.