16-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: నగర శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం ఉదయం అల్విన్ కాలనీ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కింద పడేశాడు. అనంతరం ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు గోవిందు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను స్థానికులు వీడియో తీయగా కాసేపటికే అది వైరల్ గా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.