16-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 16: ఎపి పిసిసి చీఫ్ గా నియామకం తర్వాత షర్మిల మొదటిసారి సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ వేదికగా స్పందించారు. తనను అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు, పునర్నిర్మించడానికి నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని.. మద్దతు కూడా కోరుతున్నానంటూ పేర్కొన్నారు. గిడుగు రుద్రరాజు సహా.. రాష్ట్రంలోని పార్టీ నాయకుల అనుభవాలు, నైపుణ్యాలతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలను కుంటున్నాను.. అంటూ వైఎస్ షర్మిల ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వైఎస్సార్సీపీపై జీరో ప్రభావం మాత్రమే చూపగలదంటూ వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఎందరో ముఖ్యమంత్రుల తమ్ముళ్ళూ, చెలెల్లు చాలా సార్లు రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ ఎవరూ ముఖ్యమంత్రులు కాలేదన్నారు.
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఎవరూలేరన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎవరికైనా ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉందంటూ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం పట్ల మల్లు రవి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. షర్మిలను ఏపీసీసీ అధ్యక్షులుగా నియమించచడం హర్షణీయం..
షర్మిల నియామకం చేసినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మల్లు రవి ప్రకటనలో తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా షర్మిల రాజకీయాలలో రాణించాలని ఆకాంక్షించారు.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగానే రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ మల్లు రవి అభిప్రాయపడ్డారు.