17-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 17: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వైసీపీ వక్రభాష్యం పలుకుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ద్విసభ్య ధర్మాసనం తీర్పులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. వీటిని యథాతథంగా చెప్పినా వైసిపి కావాలనే తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతోందని అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడుతూ.. 'కోర్ట్ తీర్పులను కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ, సాక్షి పత్రిక దిగజారింది.
జస్టిస్ అనిరుద్ బోస్ ధర్మాసనం 82 పేజీల తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17ఏ వర్తింపునకు సంబంధించి ఇద్దరు జడ్జి లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. దీనితో ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామని చెప్పారు. లార్జర్ బెంచికి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని కోరతామని పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 9న ఈ అంశంపై కేసు పెట్టారు. 2018 జులై 26న 17ఏ అమల్లోకి వచ్చింది. ఈ కేసులో 2018లో దర్యాప్తు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
జస్టిస్ అనిరుద్ బోస్ 17ఏ వర్తించదు అని, భేలా త్రివేది వర్తిస్తుంది అని చెప్పారు. అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉండి పొన్నావోలు సుధాకర్ రాజకీయ చేయడం తగదు. సాక్షి కోర్ట్ ధిక్కరానికి పాల్పడింది. పొన్నావోలు చేసిన వ్యాఖ్యలను కోర్టు చెప్పినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుంటా. సీఎం జగన్ కోర్టుల్లో స్టే తెచ్చుకుని పబ్బం గడుపుతున్నారు. ఆయన జేబసంస్థ సీఐడీ చంద్రబాబుపై కేసులు పెట్టిందని కామెంట్స్ చేశారు.