17-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, జనవరి 17: అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని జగన్ వచ్చి నాశనం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. వారికి చెడ్డపేరు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేదన్నారు.
జగన్ పాలనలో వ్యవసాయ రంగం అన్ని విధాల నిర్వీర్యమైందని విమర్శించారు. పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా వారిని పరామర్శించారా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని స్పష్టం చేశారు.
రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. జగనన్ను ఇంటికి పంపేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే సాక్షి మీడియాకు ప్రజలే బుద్ధి చెబుతారని యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.