17-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గురువారంతో గడువు ముగియనుంది. రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల కావడంతో రెండు పదవులకు విడివిడిగా ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెన్ కు మాత్రమే ఎమ్మెల్సీ పదవులను గెల్చుకునే అవకాశం ఉంది.
రెండు పోస్టులకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ మార్క్ ట్విస్టులు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారులో కనిపించాయి. ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ పేర్లను ఖరారు చేసినట్లుగా మంగళవారం వారికి ఏఐసీసీ నుంచి సమాచారం వచ్చింది. అయితే బుధవారం విడుదలయిన జాబితాలో మాత్రం బలమూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది.
దీంతో అద్దంకి దయాకర్ కు షాక్ తగిలినట్లయింది. అద్దంకి దయాకర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేదా వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇస్తారని కాంగ్రెన్ వర్గాలు చెబుతున్నాయి. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. గురువారంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా.. బుధవారం అభ్యర్థులను ప్రకటించింది.
అయితే, చివరి వరకు కూడా అద్దంకి దయాకర్ కే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు అని ప్రచారం జరుగగా.. తాజాగా సీన్ రివర్స్ అయ్యింది. అంతేకాదు.. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారని ప్రచారం సాగింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. దయాకర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈ సంబరాలు, అనందం గంటల్లో ఆవిరయ్యాయి. కాంగ్రెన్ ప్రకటించిన జాబితాలో దయాకర్ పేరు మిన్ అయ్యి.. మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుండగా.. 29న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు మాత్రమే నామినేషన్ వేస్తే.. ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉంది.