17-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పిటిషన్లపై తీర్పు వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌కుమార్, సత్యనారాయణ పేర్లను కేబినెట్ నామినేట్ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. అయితే, ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదం తెలుపలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, తమ పేర్లను ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆర్టికల్ 171 ప్రకారం.. తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని.. గవర్నర్‌కు తిరస్కరించే హక్కు లేదని పేర్కొన్నారు. ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేంటూ శ్రవణ్, సత్యనారాయణ తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరఫు కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని పేర్కొంటూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.