17-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 17: సిరిసిల్ల కార్మికులకు బతుకమ్మ బకాయిలు చెల్లించి ఆదుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల బకాయిలు రూ.220 కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే బకాయిలు చెల్లించాలన్నారు.
ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. 'వర్కర్ టు ఓనర్' పథకానికి నిధులు మంజూరు చేసి సంపూర్ణంగా అమలు చేయాలి. మరమగ్గాల ఆధునికీకరణకు అవసరమైన నిధులు కేటాయించండి. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళతాన అని బండి సంజయ్ పేర్కొన్నారు.