17-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 17: ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు. సచివాలయంలో ధరణి పోర్టల్, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై కమిటీ రెండో సమావేశం జరిగింది.
ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందులు పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించిందని కోదండ రెడ్డి చెప్పారు. ఎంతకూ తెగని భూముల పంచాయితీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుందన్నారు. ధరణి సాఫ్ట్ వేర్ ఏమిటి.. ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పులపైనా కమిటీ సమగ్రంగా వివరాలు తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు.
భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి పరిష్కార మార్గాలు కనుగొంటామని అన్నారు. ధరణి పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని కోదండరెడ్డి ఆరోపించారు. ధరణి సమస్యలపై కమిటీ మెంబర్లు.. అధికారులకు సమాచారం అడిగారు. ఇందుకుగానూ వారు సీసీఎల్ఎపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ధరణితో వచ్చిన భూ సమస్యల పరిష్కారం బుధవారం నుంచే ప్రారంభమైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీసీఎల్ఎ కార్యాలయంలో రాబోయే సమావేశాలు ఉంటాయన్నారు.
కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 'ధరణిలో సమస్యలు గుర్తించే పని మొదలైంది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తాం. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా మా కమిటీ పని చేస్తుంది. వచ్చే సోమవారం సీసీఎస్ఏ భేటీ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. పోర్టల్లో 35 సమస్యలున్నట్లు గుర్తించాం. ధరణి స్థానంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ పై అధ్యయనం చేయాల్సి ఉంది' అని అన్నారు.
సోమవారం రోజున కమిటీ మూడో సమావేశం సీసీఎల్ ఏ ఆఫీసులో జరుగుతుందని, ఆ రోజు తాము తీసుకోబోయే చర్యలపై వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు. సమావేశంలో ధరణి కమిటీ కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.