17-01-2024 RJ
సినీ స్క్రీన్
కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కి.. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'నా సామిరంగ' చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే కలెక్షన్లు పండిస్తోంది. బ్రేకీవెనికి దగ్గరగా వచ్చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిరా మీనన్, రుక్సర్ థిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని.. విడుదలైన లిమిటెడ్ థియేటర్లలోనే భారీ కలెక్షన్స్ రాబడుతూ.. సక్సెస్ఫుల్గా దూసుకెళుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం బ్రేకీవెన్ కి దగ్గరగా వచ్చినట్లుగా తెలుపుతూ.. మూడు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రకారం మూడో రోజు కూడా కిష్టయ్య కుమ్మేశాడు అనేలా కలెక్షన్స్ రాబట్టాడు.
మొదటి రోజు నా సామిరంగ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8.6 కోట్ల కలెక్షన్స్ రాబడితే.. రెండు రోజు రూ. 9.2 కోట్ల గ్రాస్ కలెక్షన్సను రాబట్టి మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ.17.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇక మూడో రోజు ఈ సినిమా రూ.7.0 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మూడు రోజులకుగానూ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లుగా.. విడుదల చేసిన పోస్టర్ లో మేకర్స్ తెలియజేశారు.
'నా సామిరంగ'కు లిమిటెడ్ థియేటర్లే లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువగానే జరిగింది. ఈ మూవీ రూ. 19 ప్లస్ కోట్ల షేర్ కలెక్షన్స్ని రాబడితే బ్రేకీవెన్ అయినట్లే. ప్రస్తుతం 3 రోజులకి ఈ సినిమా రూ. 13 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పండగ ఈ సినిమాకు అడ్వాంటేజ్ అయింది. బుధవారం నుండి ఈ సినిమా రాబట్టే కలెక్షన్ లే అత్యంత కీలకం కానున్నాయి. అయితే, పాజిటివ్ టాక్ తో పాటు.. మరో వారం, పది రోజుల వరకు ఇతర సినిమాలేవీ లేవు కాబట్టి.. కచ్చితంగా 'నా సామిరంగ' బ్రేకీవెన్ అయ్యి, లాభాల బాట పట్టే అవకాశం ఉంది.