17-01-2024 RJ
సినీ స్క్రీన్
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రానికి 'రాజా సాబ్' అనే పేరు నిర్ణయించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో 'రాజా సాబ్' చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందిస్తుండడంతో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వింటేజ్ లుక్ లో లుంగీ కట్టుకున్న ప్రభాస్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. సరదాగా, రొమాంటిక్ గా సాగే క్యారెక్టర్ లుక్లో 'డార్లింగ్' ప్రభాస్ ను చూడడంతో అభిమానులతో పాటు సినిమా లవర్స్ అందరికీ ఫ్రెష్ ఫీల్ కలుగుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లోనే ఒక కలర్ఫుల్ సినిమా చూడబోతున్న భావనని మారుతి కలిగించారు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'మగధీర', 'బాహుబలి' చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్ అందించిన కమల్ కన్నన్ ఈ సినిమాను వర్క్ చేస్తున్నారు.