18-01-2024 RJ
తెలంగాణ
మహబూబనగర్, జనవరి 18: తెలంగాణలోని అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. సిఎం రేవంత్ రెడ్డికి ఓ రకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సొంతం కావడంతో ఆయన ఇక్కడి రెండు స్థానాలపై దృష్టి సారించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ గెలవడం కోసం స్కెచ్చ వేసినట్లు సమాచారం. అధికారంలో ఉండడం వల్ల గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలు గెల్చుకుంది.
ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అధికారం లేకపోవడంతో పాటు, వారి అవినీతి కూడా బద్దలవుతున్న కారణంగా వారిని నమ్మి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. ఇది గమనించి బిఆర్ఎస్ సిట్టింగులకు మళ్లీ సీటు ఇస్తుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఉత్సాహం తగ్గింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాల్సి పరిస్థితి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది కేవలం రెండు సీట్లు మాత్రమే. అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఓటమి నుంచి కోల్కొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రెండు పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.
2019లో మహబూబ్ నగర్ ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు విజయం సాధించారు. ఈ ఇద్దరు ఎంపీలు ప్రజల మెప్పును సాధించడంలో విఫలం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో దించాలనే యోచనలో బిఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార కాంగ్రెస్, బిజెపిలు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సంప్రదించినట్లు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసక్తి చూపలేదని తెలిసింది. బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి పేర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎంపీ రాములును మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ గట్టి అభ్యర్థలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి బిజెపి మరోమారు మాజీ ఎంపి జితేందర్ రెడ్డిని బరిలోకి దింపవచ్చని అంటున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటాలనే ప్రయత్నంలో సిట్టింగ్ సీట్లు ఉంటాయా.. ఊడతాయా అంటూ గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. రెండు సీట్లను గెలుస్తామని కాంగ్రెస్ భరోసాగా ఉంది.