18-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఎపి కాంగ్రెస్ లో మళ్లీ కదలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. చురకుగా వ్యవహరించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆనాడు వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కెవిపి రామచంద్రారవు మరోమారు చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంది.
దీనినితోడు వైసిపిలో అసంతృప్త నేతలంతా షర్మిల వైపు చేరవచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే షర్మిలతో కలసి నడుస్తానని ప్రకటించారు. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, టి. సుబ్బరామిరెడ్డి వంటి ఉద్దండులు మరోమారు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చీఫ్ గా బాధ్యతలు ఇచ్చింది. కుమారుడి పెళ్లి పనుల్లో కాస్త బిజీగా ఉన్న షర్మిల రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న నమ్మకాన్ని కలిగించడం కోసం షర్మిల ముందుగా అందరిని కలుసుకుని ముందుకు సాగే అవకాశం ఉంది. అందుకోసం ప్రజల్లో నమ్మకం కలిగించేలా పర్యటనలు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో పాదయాత్రతో ప్రజల్లో కదలిక తెచ్చిన చరిత్ర ఆమెది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే ఒక శాతం కన్నా తక్కువ. ఇప్పుడు షర్మిలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం వెనక్కి తెచ్చుకోవడం వైఎస్ కుమార్తెగా మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవడం వంటివన్నీ కలసి ఆరనున్నాయి. వైఎస్ అనుచరులు కూడా ఆమె వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి. జగన్తో ఇమడలేని వారు ముందుగా షర్మిలను అనుసరిస్తారు. ఇలా అనేక అంశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నించవచ్చు ఈ విషయం అంతా షర్మిల చేతుల్లోనే ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీరో పొజిషన్లో ఉంది.
ఆ పార్టీ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఎంత వచ్చినా వచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని షర్మిల బలం పుంజుకుంటే ఆమె రాజకీయ జీవితం మలుపు తిరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీని నడిపినా నాన్ లోకల్ అన్న భావన ప్రజల్లో నాటుకు పోయింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.
అక్కడ పోటీ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చివుండేద ఇకాదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆమెకు సువర్ణావకాశం వచ్చినట్లే. రాజకీయంగా బలోపేతం అవ్వాలనుకుంటే.. షర్మిలకు కాంగ్రెస్ గొప్ప చాన్స్ ఇచ్చినట్లేనని భావించాలి. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ అనేది ఉండాలి. అలా ఉంటేనే ఆ పార్టీ ఎన్నికల రేసులోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ జగన్ కు బదలా యింపు జరిగింది. ఓ రకంగా ఇప్పుడ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల ఆ ఓటుబ్యాంక్ ఎంతోకొంత కాంగ్రెస్ కు చేరుతుంది.
గట్టిగా ప్రయత్నిస్తే జగన్పై ఉన్న అసంతృప్తి కారణంగా మరింత జమకాగలదు. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే లాభం లేదన్న భావనలో జగన్కు అండగా ఉంటూ వచ్చారు. జగన్ నాయకత్వంలో ఉన్న పార్టీలోనే చాలా మంది కాంగ్రెస్ ను చూసు కుంటున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న వర్గాలన్నీ గుంపగుత్తగా వైఎస్ జగన్ కు మద్దతు పలకడమే దీనికి సంకేతం. ఇప్పుడు వైఎస్ మరో బిడ్డ కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న కారణంగా వీరంతా మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో వివిధ కారణాలతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడానికి షర్మిలకు అవకాశం వచ్చింది. అయితే ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. పూర్తి స్థాయిలో షర్మిల నాయకత్వ సామర్థ్యం చూపించి.. కాంగ్రెస్ సే మన పార్టీ అందర్నీ నమ్మించగలగాలి.
విభజన హామీలకు గట్టి భరోసా ఇవ్వగలగాలి. తాను తలపడబోయే ప్రత్యర్థుల్లో కుటుంబసభ్యులు ఉంటారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంక్ వెనక్కి రావాల్సి ఉంది. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు.
అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా కుటుంబసభ్యుల మీదుగానే పోటీ చేయాల్సి ఉటుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంచి దారి అవుతుంది. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డిపై పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకు వచ్చే అవకాశం ఉంది.