18-01-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జనవరి 18: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిందని, దీనిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. అనేకానేక విభజన హామీలపై బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాట్లాడాలని అన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాలమూరుకు జాతీయ హోదా తెస్తామని చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీలో ప్రతిరోజూ బిజెపి నాయకుల మెడలకు దండలు వేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బిజెపి మైత్రిని బండి సంజయ్ బహిరంగంగా ఒప్పుకున్నారని, కెసిఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఎలను కొంటారని చెప్పడం దారుణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బిజెపిదేనని బండి సంజయ్ గుర్తించాలని అన్నారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బిజెపి బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ప్రజలు ఇంకా మరచిపోలేదని గుర్తుచేశారు.
బండి సంజయ్ సహా బిజెపి నేతలు వార్తల్లో ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. వారికి ఎంపి ఎన్నికల్లో పరాభవం తప్పదని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్ ఏనాడూ ఒక్క రూపాయి అయినా తేలేని వాడు... అడ్డమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికతోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.