18-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉందంటూ కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లను పనుల పేరుతో సస్పెన్షన్ల పేరుతో వేధించింది నిజం కాదా? అని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనలా పేరుతొ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మరు కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా కేటీఆరు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. 10 సంవత్సరాల మీ పాలనలో సర్పంచ్‌లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా? అని కేటీఆర్‌ను మంత్రి ప్రశ్నించారు. మీ హయాంలో సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ ఆఫీస్ నిర్వహించిన జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేక పోయాం. వాటిని ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే మీ తరఫున గొంతు విప్పడానికి నేను సిద్ధంగా ఉంటా అని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
కాగా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ హయాంలో 1,858 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, కొత్తగా 9,355 గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించారని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల అభివృద్ధి కోసం నూతనంగా అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ను కూడా సృష్టించామని చెప్పుకొచ్చారు.
దీనికి మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉండగా నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా వ్యవహరించి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.