18-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: నగర ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాల్స్, థియేటర్స్, వ్యాపార భవనాల వద్ద రోడ్ పై పార్క్ చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తామని మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ, డీవీ శ్రీనివాస్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పాదచారులు ఫుట్ పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను వినియోగించుకోవాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం వేసుకోవాలని సూచించారు. రాంగ్ రూట్ లో వాహనం నడిపి యాక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్ పాత్ అక్రమిస్తున్న వ్యాపారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. సైబరాబాద్ పరిధిలో 55 పేలికన్ సిగ్నల్స్ ఉన్నాయని తెలిపారు.
భారీ వాహనాలు డీసీఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఉదయం 7:30గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 4గంటల నుంచి 10గంటల 30 నిముషాల వరకు అనుమతి లేదని చెప్పారు డీసీపీ శ్రీనివాస్. కన్స్ ట్రక్షన్.. భవనాలు కూల్చివేసే వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు అనుమతి లేదన్నారు. నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై తిరిగితే మోటార్ వాహనాల యాక్ట్ లో సెక్షన్ ల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.