18-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుడివాడ, జనవరి 18: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే.. పేదరిక నిర్మూలన కోసం టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన 'పూర్ టు రిచ్' కాన్సెప్ట్ ను ఆయన ఆవిష్కరించారు.
అలాగే.. ఆ దాని లక్ష్యాలను కూడా వివరించారు. ఈ కాన్సెప్ట్ భాగంగా.. పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారి పల్లె గ్రామాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిమ్మకూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు. నిమ్మకూరు గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని.. అయితే 80 మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని, చాలామంది వలస వెళ్లారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని.. వాళ్లందరూ గ్రామంలోని కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవడానికి చేయూత అందించాలని, ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్న ఆయన.. అందరి ఆలోచనలను తీసుకొని ముందుకు సాగుదామని చెప్పారు. పేదవాళ్లకు సాయం చేయడమే నిజమైన రాజకీయమని ఎన్టీఆర్ చాటి చెప్పారన్నారు.