19-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 19: నాగోబా జాతర ప్రాంతంలో సందడి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధుల రాకపోకలు, పనులతో ఇక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. కేస్లాపూర్ లో ఈ నెల మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతో ప్రారంభం అయ్యాయి. నాగోబా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు హాజరవుతున్నారు. ప్రధానంగా గోండులు అత్యంత పవిత్రంగా భవించే జాతర కావడంతో ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. నాగోబా దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు భక్తుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తున్నారు.
గిరిజనుల సంప్రదాయ సంస్కృతికి సంబంధించిన ఆటలపోటీల నిర్వహణపై శ్రద్ధ తీసుకున్నారు. నాగోబా ఆలయంతోపాటు అవసరం ఉన్న చోట్లల్లో ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో జాతర సందడిగా మారింది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉందని స్థానిక నేతలు అన్నారు.
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. నాగోబా జాతర ఉత్సవాలు నిర్వహణతోపాటు చేపట్టే అభివృద్ధికి నిధులు మంజురు చేసిందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా పండుగలను జరుపుకో వాలన్నారు. మెస్రం వంశీయులు నిర్వహించే ప్రత్యేక పూజలతోపాటు వారి సంప్రదాయాలు చాలా బాగున్నాయన్నారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ఇలాగే ముందుకు తీసుకుపోవాలన్నారు. నాగోబా జాతరలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.