19-01-2024 RJ
తెలంగాణ
వేములవాడ, జనవరి 19: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్నకు మొక్కులు సమర్పిస్తారు. ఇక్కడ మొక్కులు తీర్చుకుని మేడారం బయలుదేరుతారు. ఈ క్రమంలో వేములవాడకు భక్తుల రాక పెరిగింది.
వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు. పలువురు భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి, స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాగా, గర్భాలయంలో ఆర్జిత సేవలు, అన్ని పూజలను అధికారులు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.