19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జనవరి 19: విశాఖలోని రామానాయుడు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూములను లేఅవుట్ చేసి విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
కాగా రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు నాటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయించింది. అయితే స్టూడియోకు కేటాయించిన భూమిని కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైకోర్టు కేసు కొట్టివేయడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు పిటిషన్ పై జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం విచారణ జరిపింది. భూమి ఎందుకు కేటాయించారు. ప్రస్తుతం లేఅవుట్ వేశారా?, కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
విశాఖలో సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధంగా ఉంచారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ప్రభుత్వం 2003లో కేటాయించిన అవసరాలు మినహా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 11లోగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు పంపించింది.