19-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 19: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పిసిసి చీఫ్ గా నియమితులు అయ్యాక ఆమె ఆంధ్రాకు రావడం ఇదే తొలిసారు. శనివారం ఆమె ఇడుపులపాయకు వస్తారు. ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు 20, 21వ తేదీలలో షర్మిల ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు షర్మిల ఇడుపులపాయకు బయలు దేరుతారు.
సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్న షర్మిల.. 21న కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. విజయవాడలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ అధిష్టానం పెద్ద బాధ్యతలే అప్పగించింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించింది. అంతకు ముందు ఏపీ పీసీసీ చీఫ్ ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అధిష్టానం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ... రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల వైఎస్సాఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా, వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే... ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా 21న షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. 2019లో జగన్ అధికారాన్ని చేపట్టే వరకు.... రాజకీయంగా షర్మిల అండగా నిలిచారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతున్న షర్మిల ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించడం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం, క్యాడర్ కి తానున్నా అంటూ భరోసా కల్పించడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రానికి చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమైనవిగా చెప్పుకుంటున్నారు. అలాగే విభజన హామీల అమలుకు ప్రజల్లో భరోసా కూడా కల్పించాల్సి ఉంటుంది.
నిత్యం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను పదే పదే చెప్పడం ద్వారా... ప్రజలలో ఆలోచన రెకెత్తించాలి. ఇలా చేయడం ద్వారా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలోకి రప్పించాలి. ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచుతూనే... సొంత పార్టీని బలపరచుకోవాలి. పార్టీని వార్డు స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలి. కింది స్థాయి నుంచి క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయాలి.
పదేళ్లుగా పార్టీకి దూరమైన, ఇతర పార్టీల్లో ఉన్న వారిని చేరదీయాలి. వైఎస్ షర్మిలకు... అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆమెకు తొలి సవాల్ ఎదురుకానుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్... రాష్ట్ర విభజనతో నష్టపోయింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం సంగతి అటుంచితే... కనీసం కౌన్సిలర్లుగా కూడా ఆ పార్టీ తరపున గెలవలేక పోయారు.
2014 ఎన్నికల ఫలితాలే...2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడుంది అనే పరిస్థితి ఏర్పడింది. హస్తం పార్టీలో మహామహులు ఉన్నప్పటికీ... వారంతా వైసీపీలో చేరకుండా సైలెంట్ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, చింతామోహన్, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి వంటి నేతలు... ఏ పార్టీలోనూ చేరలేదు. అలా అని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పలేదు. షర్మిల బాధ్యతలు చేపట్టడంతో వారంతా మళ్లీ చురుకుగా తయారు కావొచ్చు.
గతేడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పార్టీ తరపున పని చేశారు. అధికార వైసీపీ, టీడీపీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఆ పార్టీలకు పోటీగా షర్మిల దూకుడుగా వ్యవహరించాలి. తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఛరిష్మాను ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి. అపుడే అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దొరుకుతుంది.