19-01-2024 RJ
తెలంగాణ
వికారాబాద్, జనవరి 19: వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మెడికల్ షాపు యజమాని, ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకంతో లక్ష్మీ (18) అనే యువతి మృతి చెందింది. కాలం చెల్లిన టాబ్లెట్ వేసుకోవడం వల్ల యువతి మరణించింది. స్వల్ప జ్వరంతో ఓ యువతి కుటుంబ సభ్యులు దోమ మండల కేంద్రంలో ఉన్న శివరాం అనే ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదించారు. ఆ తర్వాత ఎమ్మారెస్ మెడికల్ షాపులో మందులు తీసుకున్నారు.
మెడికల్ షాప్ యజమాని భాస్కర్ కాలం చెల్లిన మందులను ఇచ్చారు. ఈరోజు (జనవరి 19) ఉదయం టాబ్లెట్ వేసుకున్న యువతి అస్వస్థతకు గురైంది. దీంతో యువతిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. యువతిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మెడికల్ షాప్ యజమాని, ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని దోమ పోలీసు స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. యువతి పరిగి మండలం జాఫర్ పల్లిలోని మోడల్ స్కూల్లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుందని.. సంక్రాంతి సెలవులకు సొంత ఊరు పాలెపల్లి ఇంటికి వచ్చి కాలం చెల్లిన మందులకు బలైంది.