19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: అంబర్ పేటలో దారుణం, ప్రేమించాలంటూ అమ్మాయిలను యువకులు వేధింపులకు గురిచేసిన ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు తాము ప్రేమించామని చెప్పుకుంటూ.. అందుకు నిరాకరించిన అమ్మాయిలపై దాడి చేయడమే కాకుండా.. ఆపై తమ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మైనర్ అమ్మాయిపై ఓ బాలుడు కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
అంతేకాకుండా బాలుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించాలని మైనర్ అమ్మాయిపై బాలుడు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరొక అమ్మాయిపై కూడా బాలుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. మైనర్ అమ్మాయిలపై దాడి తర్వాత తీవ్ర భయాందోళనకు గురైన సదరు బాలుడు ఆపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యానగర్ రైల్వే ట్రాక్ పై పడుకుని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన అమ్మాయిలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.