19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. కెఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఉన్న ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని సూచించారు.
కెఆర్ఎంబికి అప్పగించాలన్న నిర్ణయాన్ని గతంలో తాము వ్యతిరేకించామన్నారు. కెఆర్ఎంబితో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తాము వాదించామని, అపెక్స్ కమిటీకి అప్పగించాలని తాము గట్టిగా చెప్పామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసే సమయంలోనే ప్రణాళిక సంఘం కొన్ని షరతులు పెట్టిందని, శ్రీశైలంలో 830 అడుగుల నీటిమట్టం నిర్వహించాలని సూచించింద న్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై గతంలో తమ ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టిందని హరీష్ రావు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డు పరిధిలోకి వెళతాయనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. లేదంటే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడాల్సి వస్తోందని అభిప్రాయ పడ్డారు.
తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్ల కోసం అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కేఆర్ఎంబీకి సంబంధించి గతంలో తమపై కూడా ఒత్తిడి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. 264 మెగా వాట్స్ విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి చేసి సాగర్ కు నీటిని విడుదల చేయాలని తాము కోరామని వివరించారు.
ఆ సూచనలు పాటించకుంటే ప్రాజెక్టులు విలీనం చేయమని తేల్చి చెప్పామని వివరించారు. కెఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందని హరీశ్ రావు అంటున్నారు. హైడల్ పవర్ జనరేషన్లో స్వయం ప్రతిపత్తిని కోల్పోతామని వివరించారు. సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల కోసం అడగాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ గతంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఏడు మండలాలు ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పక్క రాష్ట్రానికి అప్పగించారని ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాయని విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా గోదావరి డెల్టాకు నీటిని తరలిస్తే సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని తెలిపారు.
ప్రాజెక్టులు కెఆర్ఎంబికి చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీరు తెచ్చుకోవచ్చని హరీశ్ రావు సూచించారు. గోదావరిలో 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వివరించారు. ఆ నీటిని లిఫ్ట్ చేసి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు. కాళేశ్వరం పంప్ హౌజుల్లో మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నడుపుతున్నారని తెలిపారు.
దీని వల్ల మోటార్లు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని మోటార్లు నడపాలని సూచించారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్ట్ తీసుకొస్తామని ఢిల్లీ వెళ్లి, ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.