19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్ తమిళిసైతో అబద్దాలు చెప్పించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో స్వేదపత్రం విడదల చేశామన్నారు. శుక్రవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, రుణాలు వసూలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని దుయ్యబట్టారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామన్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా విడిచి పెట్టేదేలేదని దుయ్యబట్టారు. కాంగ్రెన్ - బిజెపి నాయకుల అసలు రంగు బయటపడుతోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెన్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీని తిడితే సిఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆయన చురకలంటించారు.
కెసిఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మన బలం, మన గళం, గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ రోజు జరిగింది.
మెదక్ పార్లమెంట్ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, నంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. ఆరు అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థుల విజయంలో మాజీమంత్రి హరీశ్ రావు కీలకపాత్ర పోషించారు. 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
దీంతో మెదక్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మెదక్ లోక్ సభ సీటును గెలుచుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారని చెప్పారు. మెదక్ లోక్ సభ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ బరిలోకి దిగకుంటే టికెట్ కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, శివకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. సమీక్షలో మాజీమంత్రి హరీశ్ రావు, పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధు సూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు.